రాష్ట్రంలోని 14 జిల్లాల్లో విద్యార్థుల డ్రాపౌట్ల శాతం 20 శాతాన్ని దాటింది. డ్రాపౌట్లలో ఈ 14 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి. మరో 10 జిల్లాల్లో 10 శాతం నుంచి 19 శాతం విద్యార్థులు డ్రాపౌట్ అవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రక్ట్-2024లో వెల్లడించింది. రాష్ట్రంలో 14-15 ఏండ్ల మధ్య వయస్కులు 11.44 లక్షలుంటే కేవలం 10 లక్షల మంది మాత్రమే పాఠశాలల్లో నమోదయ్యారు. రాష్ట్రంలో 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత విద్యార్థుల్లో అత్యధికులు డ్రాపౌట్ అవుతున్నారు.
9, 10 తరగతుల్లో డ్రాపౌట్ రేట్ అధికంగా ఉంది. ఇక ఉన్నత పాఠశాలల్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 17 జిల్లాల్లో అతి తక్కువగా ఉంది. ఈ జిల్లాల్లో ఒక్కో స్కూల్లో సగటు విద్యార్థుల సంఖ్య 80 లోపే ఉంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో సగటు 149గా ఉంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సగటు 100లో ఉన్న జిల్లాలు 23 ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో సగటున విద్యార్థుల సంఖ్య 100లోపు ఉన్నవి 20 జిల్లాలు ఉన్నాయి.