ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న రాజస్థాన్‌కు చెందిన సాహిల్ చౌదరి (19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం గదిలో ఒక్కడే ఉన్న సాహిల్ చౌదరి తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. రూములో ఉండే మిగతా స్నేహితులు వచ్చి సాహిల్‌ను పిలిచినా పలకకపోవడంతో తలుపు తీసే ప్రయత్నం చేశారు. తెర్చుకోకపోవడంతో తలుపులు పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
వెంటనే తోటి విద్యార్థులు ఆయనను రిమ్స్‌కు తరలించారు. విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పోలీసులు హాస్టల్ కు చేరుకొని వివరాలు సేకరించారు. రిమ్స్ అధ్యాపకులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఆత్మహత్యగల కారణాలు తెలుసు కుంటామని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. పోలీసులు విద్యార్థి సెల్ ఫోన్ ను పరిశీలిస్తున్నారు. కాగా, ఆగస్టు రెండు నుంచి ఎంబీబీఎస్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంతలో ఇలా జరుగడటంతో మెడికల్ కాలేజీలో విషాదఛాయలు అలుముకున్నాయి.