మక్తల్/దుండిగల్, డిసెంబర్ 2 : బాచుపల్లిలోని శ్రీచైతన్య రెసిడెన్షియల్ కళాశాల(వైష్ణవి క్యాంపస్)లో మక్తల్ పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని, మృతురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం రెడ్డినగర్‌కు చెందిన మాధవరెడ్డి, నర్మద దంపతుల కూతురు వర్షిత(16) హైదరాబాద్‌లోని బాచుపల్లి శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది.
మక్తల్ ఆంజనేయస్వామి జాతర నిమిత్తం తమ కూతురిని మక్తల్ తీసుకుపోవాలని ఆదివారం విద్యార్థిని తల్లి నర్మద కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్‌ను కోరడంతో పరీక్షలు ఉన్నాయని విద్యార్థిని పంపించడం కుదరదని చెప్పారు. దీంతో వర్షిత తల్లి మక్తల్‌కు తిరిగి వచ్చేసింది. అయితే తనను ఊరికి పంపలేదని మానసిక వేదనకు గురైన వర్షిత సోమవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు సోమవారం రాత్రి కళాశాలకు చేరుకుని, ఆందోళన చేపట్టాయి. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ విద్యార్థులు కళాశాల ఎదుట నినాదాలు చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని, కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మృతురాలి తండ్రి మధుసూదన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.