బాలానగర్, ఫిబ్రవరి 6 : గురుకుల పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పాఠశాల ఉపాధ్యాయుల కథనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లికి చెందిన ఆరాధ్య (15) బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. గురువారం తెల్లవారుజామున 5:30 గంటల వరకు స్టడీ అవర్‌లో తోటి విద్యార్థినులతో కలిసి చదువుకున్నది.
తర్వాత విద్యార్థినులంతా స్నానాలకు వెళ్లగా.. ఆమె కూడా బకెట్ తీసుకొని వెళ్లింది. బకెట్ బాత్రూం బయటే వదిలేసి సమీపంలో ఉన్న చీర తీసుకొని 6:30 గంటల ప్రాంతంలో ఏడో తరగతి గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పుస్తకాల కోసం తరగతి గదిలోకి వెళ్లిన విద్యార్థులు గమనించి ప్రిన్సిపాల్ అంజన్రెడ్డితోపాటు ఉపాధ్యాయులకు తెలిపారు. వారు వెంటనే బాలికను షాద్‌నగర్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
విషయం తెలుసుకొన్న ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని గేటు ఎదుట ఆందోళనకు దిగారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, డీఈవో ప్రవీణ్ గురుకులానికి చేరుకొని బాలిక తల్లిదండ్రులు రమేశ్, రజిత, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని, రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై లెనిన్ తెలిపారు.