తొర్రూరు,జులై 29 : ఎలుకల మందు(Rat poison) తాగి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వావిలాల గ్రామపంచాయతీ మర్రికుంట తండాకు చెందిన బానోత్ వెంకన్న, అనిత దంపతుల కుమారుడు వెంకటచైతన్య(15), తొర్రూరు పట్టణ కేంద్రంలోని అభ్యాస్ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పాఠశాల హాస్టల్లో ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
వెంటనే యాజమాన్యం వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్కు తరలించగా పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. సోమవారం రాత్రి చికిత్స పొందుతూ వెంకట చైతన్య మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు స్కూల్ ఎదుట మృతదేహంతో నిరసన తెలిపారు. తమ కుమారుడి మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.