హైదరాబాద్,డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): వీబీ-జీరామ్-జీ చట్టాన్ని రద్దు చేసి, గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పునరుద్ధరణ చేసే వరకు వామపక్షాలు, ప్రజాతంత్ర, లౌకికవాదశక్తులన్నీ నిరంతర ప్రజా ఉద్యమాలు చేపట్టాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, కార్పొరేట్ శక్తుల కోసం పేదల పొట్ట కొట్టడం సరికాదని మండిపడ్డారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం సికింద్రాబాద్ ఎంజీరోడ్ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం నేతలు కే నారాయణ, వీబీ రాఘవులు మాట్లాడుతూ.. వీబీ-జీరామ్-జీ చట్టం రద్దు అయ్యేంత వరకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్లో వామపక్షాల బలం తగ్గితే లౌకిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా వామపక్షాలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ, రాష్ట్రకార్యవర్గ సభ్యులు చాయాదేవి, ప్రేమపావని, స్టాలిన్, జాన్వెస్లీ, జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.