హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలుచేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత ఎస్ మధుసూదనాచారి తెలిపారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఓటు బ్యాంకుగానే చూస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్‌తో కలిసి శాసనమండలిలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా వారంరోజులు కూడా కాని మహేశ్‌కుమార్‌గౌడ్.. దమ్ముందా? అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి మాట్లాడటం తగదని హితవు పలికారు.
బీసీల పోరాటం ఫలితంగానే ఆయనకు ఆ పదవి వచ్చిందనే విషయాన్ని మరువొద్దని సూచించారు. బీసీ డిక్లరేషన్‌పై ఒత్తిడి తేవడంతోనే ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారని గుర్తుచేశారు. అన్ని పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసిందని తెలిపారు. బీసీలకు ఏటా 20 వేల కోట్లు, ఐదేండ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పి గత బడ్జెట్లో అందులో సగం కూడా కేటాయించలేదని విమర్శించారు. కేటాయించిన నిధులనూ ఖర్చు చేయడంలేదని ధ్వజమెత్తారు.బీసీలను ఓటు బ్యాంకుగా చూడొద్దని, అన్యాయం చేస్తే ప్రతిఘటన ఎదురోక తప్పదని హెచ్చరించారు. పలుకుబడి ఉంటే మహేశ్‌కుమార్‌గౌడ్ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.