వరంగల్ : విభజన చట్టం ప్రకారం కేంద్రం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే వరకు పోరాటం చేయవలసిన అవసరముందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapally Vinod Kumar) అన్నారు. కాజీపేట పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కాజీపేట( Kazipet) లో కోచ్ ఫ్యాక్టరీ(Coach factory) ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీల నాయకులు నాలుగు దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారన్నాని గుర్తు చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యేంత వరకు కలిసొచ్చే ఆయా పార్టీలతో కలుపుకొని బీఆర్ఎస్(Brs) ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఉమ్మడి వరంగల్ హామీలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ (Bayyaram Steel ) , ములుగు గిరిజన యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, దేశంలో కేసీఆర్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలోని అయోధ్య పురంలో కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే కావలసిన భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ , నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.