కొల్లాపూర్/పెంట్లవెల్లి, ఏప్రిల్ 5: అభివృద్ధి పేరుతో దళితుల భూములను చట్టవిరుద్ధంగా లాక్కొంటూ దళితులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సోమశిల వద్ద ఆదివారం అధికారులు చేపట్టిన హెలిపాడ్ నిర్మాణంలో భూ ములను కోల్పోతున్న దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బీరంను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకున్నది. అనంతరం మాజీ ఎమ్మెల్యే బీరం మీడియాతో మాట్లాడుతూ.. దళితుల భూముల్లో హెలిప్యాడ్ నిర్మాణం చేపట్టడం సరైనది కాదని హితవు పలికారు.
చట్టవిరుద్ధంగా దళితుల నుంచి అసైన్డ్ భూములను లాక్కొంటున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా వెళ్తున్నవారిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా సోమశిలలో హెలిప్యాడ్ నిర్మాణం కోసం చదును చేస్తుండగా అడ్డుకున్న దళిత రైతులు రంగస్వామి, తిరుపాల్, కురుమ్య, కుమార్‌ను కొల్లాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని పెంట్లవెల్లి పోలీస్‌సేష్టన్‌లో నిర్బంధించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పెంట్లవెల్లి పోలీస్‌స్టేషన్ వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు.