హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ‘అరవై ఏండ్ల పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేసింది కాంగ్రెస్ కాదా? ప్రస్తుత దుస్థితికి ఆ పార్టీ కారణం కాదా? అంత బాగుచేసి ఉంటే ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ఎందుకువచ్చింది? రెండేళ్ల కిందట అధికారం చేపట్టిన రేవంత్ సర్కారు ఉద్ధరించిందేంటి? కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేదేందుకు?’ అంటూ తెలంగాణవాది నవీన్ జలగంతో పాటు పలువురు ప్రశ్నించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆదివారం జరిగిన టీడీఎఫ్ సిల్వర్‌జూబ్లీ ముగింపు సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
అంతకుముందు కేసీఆర్‌పై తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో విద్యారంగా న్ని పట్టించుకోలేదని మురళి చేసిన ఆరోపణలు సత్యదూరమని తిప్పికొట్టారు. వెయ్యి గురుకులాలు నిర్మించి సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యనందించింది కేసీఆర్ కాదా? తెలంగాణ రాకముందు మైనారిటీ స్కూళ్లకు రూ. 200 కోట్లున్న బడ్జెట్ కేటాయింపులను రూ. 2000 కోట్లకు పెంచింది కేసీఆర్ కాదా? ఈ విషయంలో మీరు చెప్పిన మాటలు అవాస్తవమని అప్పటి ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ మీకు కౌంటర్ ఇవ్వలేదా? వేలాది టీచర్ల పోస్టులు భర్తీ చేయలేదా?
కండ్లముందు ఈ వాస్తవాలు కనబడడంలేదా? అప్పటి ప్రభుత్వంలో అధికారిగా పనిచేసిన మీకు ఇవన్నీ తెలియదా? కేసీఆర్‌పై వ్యక్తిగత కక్షతో పదేపదే అబద్ధాలు చెప్పడమెందుకు? రాజకీయేతర వేదికపై రాజకీయ విమర్శలెందుకు?’ అంటూ సూటిగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును ఎండగట్టారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో మళ్లీ పూర్వపు పరిస్థితులు దాపురించాయని దుయ్యబట్టారు. తన వద్దే పెట్టుకున్న విద్యాశాఖను ముఖ్యమంత్రి గాలికొదిలేశారని నిప్పులు చెరిగారు. పురుగుల అ న్నం తిని గురుకుల విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే చోద్యం చూస్తున్నారని విరుచుకుపడ్డారు.
కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఆకునూరి మురళికి ఘాటుగా సమాధానమిస్తున్న తెలంగాణ వాది నవీన్ జలగం చేతుల నుంచి నిర్వాహకులు బలవంతంగా మైక్ లాగేసుకున్నారు. దీంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మీటింగ్‌లో కలకలం రేగింది. మాట్లాడుతుండగానే బలవంతంగా మైక్ గుంజుకోవడం పై సమావేశానికి హాజరైన తెలంగాణ వా దులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వేదికపై కూర్చున్న ఎమ్మెల్సీ కోదండరాం మౌనం దాల్చడంపై మీటింగ్‌కు హాజరైన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.