హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లుచేసింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ జాతరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొంటూ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్టు అడిషనల్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసేందుకు 382 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశామని చెప్పారు. గద్దెల సమీపంలో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రతి క్షణం పోలీస్ ఉన్నతాధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. జాతర ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నా, ఇప్పటికే రోజుకు రెండు లక్షల మంది వరకు భక్తులు వస్తున్నట్టు తెలిపారు. సమ్మక్క-సారలమ్మ గద్దెలకు దారితీసే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ నియంత్రణపై దృష్టిపెట్టినట్టు తెలిపారు. పస్రా పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జాతర బందోబస్తు కోసం ఐజీ స్థాయి నుంచి హోంగార్డు వరకు 10,300 మంది సిబ్బందిని నియమించినట్టు తెలిపారు. అదనంగా మరో మూడు వేల మందిని అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.