కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 4 : కరీంనగర్ కాంగ్రెస్‌లో పార్టీ నాయకుల మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఓవైపు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో అంతర్గత పోరు సాగుతూనే ఉండగా, తాజాగా గ్రూపు తగాదాలు రోడ్డుక్కెక్కుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల కోసం పలువురు నాయకుల మధ్య పోరు వల్లే రాస్తారోకోలు చేసేంత స్థాయికి వచ్చిందన్న ప్రచారం సాగుతున్నది. ఇటీవలి కాలంలో నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యత, అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యత కూడా కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావుకు సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారన్న ప్రచారం జోరుగా సాగుతున్నది.
ఈ విషయంలో పలువురు నాయకుల మధ్య పోటీ ఉందన్న ప్రచారం కూడా ఉన్నది. దీంతో వారిని అడ్డుకునేందుకు వివిధ సంఘాల పేరుతో కార్యక్రమాలను చేపడుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఇటీవల వెలిచాల రాజేందర్రావు వినాయక, దసరా సందర్భంగా దుర్గా నవరాత్రి ఉత్సవాల మండపాలకు ప్రభుత్వం నుంచి ఉచిత విద్యుత్తు అందిస్తున్నారన్న పోస్టర్లను రూపొందించారు. వీటిని ఆటోలపై, మండపాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
ఈ పోస్టర్లలో దళిత నేత, మానకొండూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, పీసీసీ నేత మహేశ్‌కుమార్ ఫొటోలు పెట్టలేదని విమర్శిస్తూ గురువారం కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేశ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఇందులో కాంగ్రెస్ ఎస్సీ సెల్ విభాగం, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు నాయకులు మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడు, దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, దళిత ప్రజాప్రతినిధుల ఫొటోలు పెట్టకుండా ప్రొటోకాల్ పాటించడం లేదని విమర్శించారు.