హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై నమోదైన రైల్‌రోకో కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ 15, 16, 17న రైల్‌రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామన్న అభియోగంతో ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు నమోదైందని, ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను నిందితుల జాబితాలో చేర్చారని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి తాను రైల్‌రోకో కార్యక్రమానికి పిలుపు ఇవ్వలేదని, కొందరు మౌఖికంగా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని తెలిపారు. అప్పట్లో మౌలాలిలో రైల్‌రోకో కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ షరతులతో కోర్టు విడిచిపెట్టిందని, ఈ కేసు నమోదైన మూడేండ్లకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని కేసీఆర్ గుర్తుచేస్తూ.. తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరుపనున్నది.