TGSRTC | హైదరాబాద్, జనవరి 21 (నమస్తేతెలంగాణ): టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈ మేరకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరుపై, ప్రభుత్వ వైఖరిపై తాడోపేడో తేల్చుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తాజాగా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ బస్సుల మాటున ప్రైవేటీకరణ అంశం దాగి ఉన్నదని జేఏసీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్టు జేఏసీ ప్రతినిధులు ఈ వెంకన్న, థామస్‌రెడ్డి, ఎండీ మౌలానా, కత్తుల యాదయ్య, సురేశ్, యాదయ్య మంగళవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని జేఏసీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలైన టీఎంయూ, ఈయూ, ఎన్ఎంయూ, బీకేయూ, బీడబ్ల్యూయూ, కార్మిక పరిషత్ ప్రతినిధులు సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను కూడగట్టి ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇస్తామని వారు ప్రకటించారు. గతంలో కేవలం ఏసీ బస్సులకే పరిమితమైన విద్యుత్తు బస్సులు.. ఇప్పుడు నాన్ ఏసీ బస్సులను సరఫరా చేస్తూ, వాటిని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్‌ప్రెస్ క్యాటగిరీల్లో తిప్పుతున్నారని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులతో బస్ డిపోలను జేబీఎం సంస్థకే అప్పగించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్టీసీలో నియామకాలు లేనట్టేనా?
ఆర్టీసీలో దాదాపు 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీ కోసం గతంలో పక్రియ ప్రారంభించినా నిలిచిపోయిందని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఆర్టీసీలోకి అద్దె బస్సులు భారీగా వస్తుండటంతో వాటి నిర్వహణకు ప్రైవేట్ సంస్థల సిబ్బందినే నియమిస్తుండటంతో ఆర్టీసీలో ఇకపై నియామకాలు ఉండకపోవచ్చని వారు ఆందోళన వ్యక్తంచేశారు.
24, 25 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసనలు
ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకంగా ఎస్డబ్లూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.