సిద్దిపేట, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాష్ట్రంలో ఎక్కడా కూడా యూ రియా కొరత లేదు. అవసరం మేరకు అందుబాటులో ఉంచాం. ఎవరైనా యూరియా కృత్రిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో యూరిత కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత లేనప్పుడు క్యూలైన్లు, పాస్‌బుక్కులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉన్నదని చెప్పారు. రైతుల అవసరాలకు తగినంత యూరియాను అందించాలని కోరారు. గతంలో లేని కొరత ఇప్పుడెందుకు వస్తున్నదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్‌చేసి, నీళ్లు పంపింగ్ చేసి రిజర్వాయర్లను నింపాలని, దీంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని హరీశ్‌రావు మంత్రి వివేక్‌ను కోరారు. సాగునీరులేక రైతులు వరినాట్లు వేయలేదని.. సిద్దిపేట జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లను కాళేశ్వరం జలాలతో నింపి సాగునీటిని విడుదల చేయాలని కోరారు.