
హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటకశాఖకు సంబంధించిన లీజు బకాయిలు, రెవెన్యూ షేర్ (ఏడీపీ)ను ఎగవేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మం త్రి శ్రీనివాస్‌గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. లీజు అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకొని విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపివేసేలా ఆయా సంస్థలకు లేఖలు రా యాలని పేర్కొన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంగళవారం పర్యాటకశాఖ పీపీపీ పద్ధతుల్లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల లీజుదారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఏ సంస్థ ఎంత బకాయి ఉందనే విషయంపై చర్చించారు. బకాయిల చెల్లింపుపై ఆయా సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సమావేశంలో పీపీపీ లీజుదారులు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, జలవిహార్, స్నో వరల్డ్, దసపల్ల, ట్రైడెంట్ హోటళ్ల ప్రతినిధులు, టూరిజం ఎండీ మనోహర్‌రావు, జాయింట్ సెక్రటరీ కరోల్ రమేశ్ పాల్గొన్నారు.