హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): క్రమశిక్షణను అతిక్రమించే పోలీసు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటున్నది. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే, రక్షణ కోసం వచ్చేవారిపై అఘాయిత్యాలకు పాల్పడే ఘటనలను ఎలాంటి పరిస్థితులలోను ఉపేక్షించవద్దని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఇన్స్పెక్టర్ కొరట్ల నాగేశ్వర్రావుతోపాటు వివిధ నేరాలు చేసిన మరో 54 మంది పోలీసు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలీస్ విభాగంలో పనిచేస్తూ క్రమశిక్షణ అతిక్రమిస్తే వేటు తప్పదని ఆయన స్పష్టం చేశారు. మారేడ్‌పల్లి ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న సమయంలో ఒక మహిళను తుపాకీతో బెదిరించి లైంగికదాడి, కిడ్నాప్‌కు పాల్పడటమే కాకుండా హత్యాయత్నం చేశాడనే ఆరోపణలపై నాగేశ్వర్రావుపై రాచకొండ పరిధిలోని వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇటీవల నాగేశ్వర్రావు షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చాడు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవారి సమస్యలను ఆసరాగా చేసుకొని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నాగేశ్వర్రావు చట్టాన్ని అతిక్రమించాడని’ సీపీ వెల్లడించారు. శాఖాపరమైన విచారణకు సమయం పడుతుందని, ఈలోగా బాధితులను, సాక్షులను బెదిరించడం, ఇతరత్రా ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, అందుకే అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన లాలాగూడ మాజీ ఇన్స్పెక్టర్ కే శ్రీనివాస్‌రెడ్డిని కూడా సర్వీసెస్ నుంచి తొలగించినట్టు తెలిపారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్‌లో రిజర్వు ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఎడ్ల శ్రీనివాస్ తన భార్యను వరకట్నం కోసం వేధిస్తూ, మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగించడంతో అతనిని కూడా ఉద్యోగంలో నుంచి తొలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
55 మందిపై చర్యలు
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, అక్రమ సంబంధాలు, భార్యలను వేధించడం, హత్యలు, హత్యాయత్నాలు, డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, రోడ్డు ప్రమాదాలు, అనధికారింగా సెలవులో ఉండేవారితో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 55 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అందులో నాగేశ్వర్రావు మినహా మిగతావారిపై విచారణ అనంతరం ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఉద్యోగం నుంచి తొలగించడం, తీసేయడం, తప్పనిసరిగా రిటైర్మెంట్ ఇప్పించడం వంటివి చేశారు. ఇందులో ఇద్దరు సివిల్ ఇన్స్పెక్టర్లను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయగా, ఆర్ఐని తొలగించారు. అలాగే ఓయూ ఠాణాలో ప్రొబేషనర్ ఎస్సైగా పనిచేసిన బీ నర్సింహా మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్ఎస్సై గొల్ల నిరంజన్‌పై రోడ్డు ప్రమాదానికి సంబంధించి 304(బీ) కేసు నమోదు కావడంతో చర్యలు తీసుకున్నారు. ఒక కానిస్టేబుల్‌ను తప్పనిసరిగా రిటైర్మెంట్ తీసుకోవాలని ఆదేశించారు. ప్రొబేషనరీ సమయంలోనే 15 మంది సిబ్బంది చట్టాన్ని అతిక్రమించగా వారిపై చర్యలు తీసుకున్నారు. నగర్ పోలీసు కమిషనర్ చర్యలు తీసుకున్నవారిలో ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్స్‌తో పాటు మినిస్టీరియల్ స్టాఫ్ ఉన్నారు.
