గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 16:16:41

మహిళల రక్షణే ధ్యేయంగా పటిష్ట చర్యలు : ఎస్పీ ఏవీ రంగనాధ్

మహిళల రక్షణే ధ్యేయంగా పటిష్ట  చర్యలు : ఎస్పీ ఏవీ రంగనాధ్

నల్లగొండ : మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సౌకర్యాలతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిందని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాధ్ అన్నారు.  శుక్రవారం ఎం.టి. ఇన్ స్పెక్టర్ స్పర్జన్ రాజ్ నేతృత్వంలో జిల్లా అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరితో కలిసి షీ టీమ్ పోలీస్ సిబ్బందికి కేటాయించిన 20 వాహనాలను డీఐజీ, ఎస్పీ రంగనాధ్ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ విషయంలో రాజీ లేకుండా పని చేస్తూ ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, మహిళల పట్ల దాడుల లాంటి నేరాల సంఖ్యను తగ్గించే విధంగా సమర్ధవంతంగా పని చేస్తున్నామని తెలిపారు. మహిళల రక్షణ విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన రీతిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.

మహిళా పోలీస్ అధికారులకు కేటాయించిన ఈ వాహనాల ద్వారా ఇకపై మహిళల రక్షణకు సంబంధించి సంఘటనా స్థలాలకు మరింత త్వరగా చేరుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతర నిఘాతో పాటు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తూ వారిని చైతన్యం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్ స్పెక్టర్ స్పర్జన్ రాజ్, ఆర్.ఐ. వైవీ ప్రతాప్, సిఐలు సురేష్, బాషా, ఎం.టి. సిబ్బంది లియాఖత్, తదితరులు పాల్గొన్నారు.


logo