ఏటూరునాగారం, జూన్ 24: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో రెండు రోజులపాటు కురిసిన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించాయి. దొడ్ల-కొండాయి గ్రామాల మధ్యలోని జంపన్నవాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే బానాజీబంధం-ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్యనున్న జంపన్నవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
బుధవారం ఎలిశెట్టిపల్లికి చెందిన అట్టం రాకేశ్‌కు జ్వరం రావడంతో మండల కేంద్రంలోని దవాఖానకు తీసుకెళ్లేందుకు తెప్పపై పడుకోబెట్టి వాగు దాటించారు. వానకాలంలో ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయని, మున్ముందు ఎలా ఉంటుందోనని గిరిజనులకు ఆందోళన చెందుతున్నారు. రాకపోకలకు వెంటనే మార్గం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.