Telangana | శక్కర్‌నగర్, సెప్టెంబర్ 10: వీధి కుక్కలు పది నెలల చిన్నారిపై దాడి చేసి చంపేశాయి. చిన్నారి మృతదేహాన్ని అత్యంత కిరాతకంగా పీక్కుతిన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బోధన్ పట్టణంలో ఓ మహిళ యాచిస్తూ పొట్టపోసుకుంటున్నది. ఆమెకు పది నెలల కుమారుడున్నాడు. కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉండే ఆమె సోమవారం రాత్రి బాబును ఓ చెట్టు కింద ఉంచి పనిమీద వెళ్లింది. కాసేపటి తర్వాత వచ్చి చూస్తే బాబు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు.
పట్టణ సీఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి.. బాబు అదృశ్యమైన ప్రాంతాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ఆరా తీయగా మంగళవారం తెల్లవారుజామున కుక్కలు ఓ బాబును నోట పట్టుకుని వెళ్లినట్టు స్థానికుడు పోలీసులకు తెలిపాడు. స్థానికుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడక్కడ మాంసపు ముద్దలు దొరికాయి. అవి చిన్నారి అవయవాలుగా గుర్తించి బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. వాటిని సేకరించి బోధన్ ప్రభుత్వ దవాఖానలో అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వీధికుక్కల బెడదతో అల్లాడిపోతున్న స్థానికులు తాజా విషాదం నేపథ్యంలో వణికిపోతున్నారు. ఇటీవలే తట్టికోట్ ప్రాంతంలో ఓ బాలుడిని కుక్కలు మెడ పట్టుకుని ఎత్తుకెళ్తుండగా అడ్డుకున్న గర్భిణితోపాటు పలువురిపై దాడి చేశాయి. ఆ ఉదంతం మరువక ముందే మరో బాలుడు కుక్కలకు ఆహారంగా మారడం స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది.