ముస్తాబాద్/గద్వాల అర్బన్/కాగజ్నగర్, ఆగస్టు 1: గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలపై ఎక్కువగా దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. బుధవారం రాత్రి సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్తండా (బట్టువానితాళ్లు)లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి ప్రాణం తీశాయి. గ్రామంలో పిట్ల రాజ్యలక్ష్మి (81) ఒంటరిగా నివసిస్తున్నది. రాత్రి భోజనం చేసిన తర్వాత తన పూరిపాకలో మంచంపై పడుకుంది. అర్ధరాత్రి కుక్కలు వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి రాజ్యలక్ష్మిపై గుంపుగా దాడి చేశాయి.
కుక్కల దాడిలో లక్ష్మి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు గురువారం ఉదయం చూడగా.. లక్ష్మి మృతదేహం రక్తపు మడుగులో గుర్తుపట్టని విధంగా పడి ఉంది. దీంతో వారంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామస్థులు వణికిపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పరిధిలోని హమాలీ కాలనీలో రెండున్నరేండ్ల అశ్వీత, ఏడాదిలోపు చిన్నారి రిషి ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. గాయపడిన ఇద్దరిని కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు.
కుక్కల దాడులపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదికోసారి కుక్కలు పట్టినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టి అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప అరికట్టేదేమీ లేదని మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సర్సిల్క్కాలనీ, తైబానగర్, అశోక్కాలనీ, ఓల్డ్ కాలనీ, ఇందిరా మార్కెట్ కాలనీల్లో రెండ్రోజుల్లో 30 మందిపై కుక్కలు దాడి చేశాయి. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు. దవాఖానలో చికిత్స చేసుకొని వెళ్లారు.