దుబ్బాక, ఆగస్టు 27: పాపం పండుటాకు.. ఒక్కగానొక్క కుమారుడు ఆ వృద్ధురాలి పోషణ మరిచాడు. దీంతో కొడుకుకు భారంగా ఉండలేక దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తున్నది. సోమవారం అర్ధరాత్రి ఆ వృద్ధురాలిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రేపల్లెవాడలో చోటుచేసుకుంది. అయ్యగారి రంగవ్వ (90)కు ఒక్కగానొక్క కొడుకు సత్యనారాయణ ఉన్నాడు.
తల్లి ఆలనాపాలన చూసుకోకపోవడంతో 20 ఏండ్లుగా దుబ్బాకలో భిక్షాటన చేసుకుని జీవించింది. ప్రస్తుతం కాళ్లు చచ్చుబడటంతో పదేండ్లుగా రేపల్లెవాడలో ఆశ్రయం పొందుతున్నది. వృద్ధ్దురాలు దీనస్థితిపై చలించిన రేపల్లెవాడ కాలనీవాసులు అక్కడున్న ఖాళీ స్థలంలో గుడిసె ఏర్పాటు చేసి ఆశ్రయం కల్పించారు.
రోజుకొకరు చొప్పున భోజనం అందిస్తున్నారు. చలి, వానను తట్టుకుంటూ దుర్భర జీవనం గడుపుతున్నది. సోమవారం అర్ధరాత్రి వీధికుక్కలు గుడిసెలోకి వెళ్లి వృద్ధురాలిపై దాడిచేశాయి. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు రంగవ్వ పరిస్థితిని చూశారు. ఈ విషయాన్ని ఆమె కొడుకు సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. అతను పట్టించుకోలేదు.
స్థానికులు మీడియాతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్‌లో ఆమెను దుబ్బాక దవాఖానకు తరలించి వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను సిద్దిపేట జిల్లా దవాఖానకు రిఫర్ చేశారు. పోలీసుల సూచనతో కొడుకు సత్యనారాయణ, మనువడు మోహన్ దవాఖానకు వచ్చారు.