నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖాన ప్రాంగణంలో శుక్రవారం ఉదయం వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. సుమారు ఏడు గ్రామ సింహాలు దవాఖానలోకి ప్రవేశించాయి. గుంపులు.. గుంపులుగా ఓపీ రూమ్ ముందు సంచరించాయి. దీంతో అక్కడున్న రోగులు భయాందోళకు గురయ్యారు. అయినా వాటిని తరుమకపోవడంతో రోగులు, వారి బంధువులు దవాఖాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
-నాగర్‌కర్నూల్
చిన్నారులపై వీధికుక్కల దాడి ఇద్దరికి గాయాలు: వనపర్తి జిల్లా అమరచింతలో ఘటన
అమరచింత, సెప్టెంబర్ 20 : ఆడుకుంటున్న చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసిన ఘటన వనపర్తి జిల్లా అమరచింతలోని శ్రీకృష్ణనగర్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఉదయం పాఠశాలకు వెళ్లే ముందు అభినాష్, అక్షయ్‌కుమార్ ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. అక్షయ్‌కుమార్ ఎడమ చెవికి, అభినాష్ వీపుపై గాయాలయ్యాయి. అక్షయ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించగా.. అభినాష్‌కు స్థానికంగా చికిత్స చేయిస్తున్నారు. కాలనీలో వీధికుక్కల సంచారం ఎక్కువైందని, మున్సిపల్ అధికారులు వాటిని పట్టణానికి దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.