హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ నయవంచనకు నిలువెత్తు రూపమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. ఇండియా కూటమి విచ్ఛిన్నంపై ఆయన గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. మిత్రపక్షాలనే ఒప్పించలేని కాంగ్రెస్.. దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని ప్రశ్నించారు. ‘మోసం కాంగ్రెస్ నైజం. నయవంచనకు నిలువెత్తు రూపం. అందుకే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు. అందుకే కాంగ్రెస్ను వీడి టీఎంసీ, ఆమ్ఆద్మీ పార్టీల ఒంటరిపోరు. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్.. దేశ ప్రజలను ఏం మెప్పిస్తుంది? మోదీని, బీజేపీని ఎదురొనే సత్తా కాంగ్రెస్కు లేదు.
ఇండియా కూటమికి అంతకన్నా లేదు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక దేశ ప్రజల చూపు ప్రాంతీయ శక్తుల వైపే. తెలంగాణలో కేసీఆర్ అయినా, బెంగాల్లో మమతా దీదీ, పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది రాష్ట్రాల్లో బలమైన పార్టీలే. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం. కేం ద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకం’ అని ట్వీట్ చేశారు.