హైదరాబాద్ : ఉత్తర బంగాళా ఖాతంలో ఆదివారం ఉదయం గంటలకు వాయుగుండం ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, సోమవారం ఉదయం వరకు వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని చెప్పింది.
కాగా, ఈ నెల 18వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, మేడ్చల్- మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.