సుబేదారి, ఫిబ్రవరి 3 : వరంగల్‌లోని అజంజాహి మిల్లు భూములు కార్మికులకే చెందాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని మావోయిస్ట్ పార్టీ జయశంకర్, మహబుబాబాద్, వరంగల్, పెద్దపల్లి (జేఎండబ్ల్యూపీ) డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో సోమవారం లేఖ విడుదలైంది. ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. అజంజాహి మిల్లును పథకం ప్రకారం దివా లా తీయించి 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి 2002లో మూసివేశారు.
2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 117 ఎకరాల 20 గుంటల మిల్లు భూములను కుడా ద్వారా ఏపీ హౌసింగ్‌బోర్డుకు 65 ఎకరాలు, రాంకీ, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ సంస్థలకు 30 ఎకరాలు విక్రయించింది. పరిశ్రమకు చెందిన 226 ఎకరాల భూమి న్యా యబద్ధంగా కార్మికులకే చెందాలి. కొంతమం ది అధికార నాయకులు ప్రభుత్వ అండతో, ఓం నమఃశివాయ, గొట్టెముక్కుల నరేందర్ మిల్లు భూములను కబ్జా చేసి ఇండ్లు నిర్మించి విక్రయిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. అసంఘటిత కార్మిక సంఘం పేరుతో సుద్దాల నాగరాజు సెటిల్మెంట్లు చేస్తూ అక్రమాలకు పాల్పడి ఆస్తులు సంపాదించాడని మావోయిస్ట్ నేత వెంకటేశ్ ఆ లేఖలో పేర్కొన్నారు.