హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) గురువారం జిల్లా ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు నియామక ప్రక్రియ చేపట్టవద్దని సూచించింది. ప్రశ్నపత్రంలో కొన్ని ప్రశ్నలు తప్పుగా రావడంతో 4 మారులు కలపాలని హైకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వెల్లడించింది. అయితే, టెక్నికల్‌గా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కాపీలు టీఎస్ఎల్పీఆర్బీకి సకాలంలో అందకపోవడంతో వారు యథావిధిగా నియామక ప్రక్రియను చేపట్టారు. దీనిపై కొందరు పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెడికల్ టెస్టులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.