హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణను ఎండబెట్టి.. ఆంధ్రాకు నీళ్ల ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర అని, అందులో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో 2014 కంటే ముందున్న సమైక్య పాలన నాటి రోజులను తిరిగి తీసుకొచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు శ్రీనివాసగౌడ్, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన వాళ్లం.. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని గంగుల స్పష్టంచేశారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ సమాజం ఉలిక్కిపడిందని, ఇది యావత్ తెలంగాణ సమాజానికి ఇచ్చిన నోటీసులు అని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని స్పష్టంచేశారు. కాళేళ్వరం అంటే మేడిగడ్డ బరాజ్ మాత్రమే కాదని, అది అనేక పంపులు, బరాజ్‌లు, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెళ్ల సమాహారమని వివరించారు. మేడిగడ్డలో మూడు పిల్లర్లు మాత్రమే కుంగితే.. ఆ ప్రాజెక్టు మొత్తం విఫలమైనట్టేనా? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు గత ఏడాది మార్చి 13న జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేశారని, రిపోర్టు ఇవ్వడానికి వంద రోజుల గడువు విధించారని, ఆ తరువాత గడువులు పొడిగించారని చెప్పారు. విచారణ పూర్తయిందని, ఇక ఎవరినీ విచారించబోమని, 31లోగా నివేదిక ఇస్తామని చెప్పిన కమిషన్.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి మేరకు కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కక్షతో కూడుకున్నవని విమర్శించారు. కాళేళ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న సమస్య మాత్రమే వచ్చిందని, దానిని రిపేర్ చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. మేడిగడ్డకు మరమ్మతు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డిపైనే విచారణ కమిషన్‌ను వేయాలని డిమాండ్ చేశారు. చార్మినార్ వద్ద గుల్జార్‌హౌస్‌లో అంతపెద్ద ప్రమాదం జరిగితే.. దానిని దారి మళ్లించడానికే ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల దందాను దారి మళ్లించడానికే ఈ నోటీసుల బాగోతమని విమర్శించారు. నోటీసులకు స్పందించడానికి ఇంకా గడువు ఉన్నదని, అందరితో చర్చించి విచారణకు హాజరు కావాలా? వద్దా? అనే దానిపై పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
పరిపాలనలో విఫలమై, పతనం అంచున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమీ చేతకాక కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కాళేళ్వరం ఒక సఫల ప్రాజెక్టు అని ఆమె అభివర్ణించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఎంత సాగయ్యిందో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత సాగైందో లెక్కలు చూసుకోవాలని సవాల్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిది పగటి కల అని, కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి సంతృప్తి చెందుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ కక్ష కట్టారని ఆగ్రహించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ బెదిరే ప్రసక్తే ఉండదని, ప్రజాక్షేత్రంలో రేవంత్ ఆగడాలను ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా అందాల పోటీలు నిర్వహిస్తున్న ప్రభుత్వానికి రాష్ట్రంలోని అమ్మలక్కల ఉసురు తాకుతుందని పేర్కొన్నారు.
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి పగ పట్టారని, దానిని మానుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులు 70 లక్షల మంది రైతులకు ఇచ్చినట్టేనని చెప్పారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలను వాడుకుని తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే.. అది కూలిపోయిందంటూ రేవంత్‌రెడ్డి దివాలాకోరు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డివి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణకు గోదావరి నీళ్లు దక్కకుండా చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. మేడిగడ్డ బరాజ్‌ను లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీళ్లను తరలించవచ్చనే కుట్ర కోణం దాగి ఉన్నదని ఆరోపించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలినా, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయినా, సుంకిశాల, పెద్దవాగు ప్రమాదం జరిగినా.. వాటిపై విచారణ కమిషన్ వేయకుండా, కేసీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని నిలదీశారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్ రాష్ట్రాన్ని మించినందుకా? రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు రైతులకు ఇచ్చినందుకా? కేసీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇచ్చారో తెలుపాలని కాంగ్రెస్ సర్కారు వైఖరిని తూర్పారబట్టారు. ఆ నోటీసులు కేసీఆర్‌కు మాత్రమే ఇచ్చినవి కాదని, ప్రతి తెలంగాణ రైతుకు ఇచ్చినట్టేనని పేర్కొన్నారు.