రాయికల్/గొల్లపల్లి/కోరుట్లరూరల్/లోకేశ్వరం, ఫిబ్రవరి 27 : రాళ్లు.. కట్టెలు.. ఇటుకలు.. చెప్పులు.. పట్టాదార్ పాసుబుక్కులు.. ఆధార్ కార్డులు.. ఇలా ఏవి ఉంటే అవి యూరియా కోసం రైతులు క్యూలో పెట్టి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు గత కొన్ని రోజులుగా దర్శనమిస్తున్నాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూర్ గ్రామంలోని పీఏసీఎస్ గోదాం వద్ద బుధవారం రాత్రి నుంచే పట్టాదారు పాసు పుస్తకాలను, ఆధార్ జిరాక్స్లను క్యూలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాశారు. ఒక్కో రైతు ఒకటి, రెండు బస్తాలు మాత్రమే పంపిణీ చేయడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు.
గొల్లపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద ఆధార్ కార్డులు, పాస్బుక్లు వరుసగా పెట్టి క్యూ కట్టారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. కోరుట్ల మండలం పైడిమడుగు పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో యూరియా కోసం ఇటుకలు, చెప్పులు, బండలు, కట్టెలను క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురుచూశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో బుధవారం రాత్రంతా శివరాత్రి జాగారం చేసినరైతులు యూరియా కోసం గురువారం ఉదయం తరలివచ్చారు. ఒక్కో రైతుకు ఐదు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో సరిపోవంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.