రామచంద్రాపురం, ఆగస్టు 30: నిషేధిత డ్రగ్స్‌కు సంబంధించిన స్టెరాయిడ్స్, క్యాప్యూల్స్ విక్రయిస్తున్న ఇద్దరిని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఆర్సీపురంలో ఏసీపీ నర్సింహారావు, యాంటీ డ్రగ్ కంట్రోలర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమౌళి మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ ఖాదర్ జిమ్ నిర్వహిస్తున్నాడు. బాడీ మజిల్స్ త్వరగా పెరగడానికి ఉపయోగించే నిషేధిత డ్రగ్స్ (స్టెరాయిడ్స్, క్యాప్యూల్స్)ను కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. వీటిని చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ ఇబ్రహీం (క్యాబ్ డ్రైవర్) సహకారంతో ఒక్కో ఇంజక్షన్ బాటిల్ రూ.300కు తెచ్చి జిమ్‌లో రూ.వెయ్యి నుంచి రూ.1,400 విక్రయిస్తున్నాడు.
ఈ డ్రగ్స్ బుధవారం కొల్లూర్ మీదుగా రవాణా అవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు, కొల్లూర్ పోలీసులు, యాంటీ డ్రగ్ స్కాడ్ బృందం సభ్యులు సంయుక్తంగా తనిఖీ చేసి ఆ ఇద్దరిని పట్టుకొని విచారించారు. బాడీ మజిల్స్ త్వరగా పెరిగేందుకు జిమ్‌లో కస్టమర్లకు వీటిని విక్రయిస్తున్నట్టు వారు చెప్పడంతో పోలీసులు చాంద్రాయణగుట్టలోని జిమ్‌లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో రూ.10 లక్షలు విలువ చేసే నిషేధిత డ్రగ్స్‌కి సంబంధించిన 26 రకాల స్టెరాయిడ్స్ ఇంజక్షన్ బాటిల్స్, 25 రకాల క్యాప్యూల్స్ ప్యాకెట్లు లభించాయి. వీటితోపాటు నిందితుల నుంచి ఐఫోన్ 14ప్రో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించినట్టు ఏసీపీ తెలిపారు. జిమ్‌లో యువత మజిల్ గ్రోత్ కోసం స్టెరాయిడ్స్, క్యాప్యూల్స్ వాడటంతో గుండెపోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నదని తెలిపారు.