హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంతో శ్రమించి తయారు చేస్తున్న ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ చారిత్రక నేపథ్యం తరతరాలు గుర్తుండేలా బ్రాండ్ పేరు ఉండాలని ఆకాంక్షించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం అనంతరం అధికారికంగా మార్కెట్లో విడుదల చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు సార్వత్రిక గుర్తింపునకు సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబులింగ్ కోసం చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోగా అమెజాన్‌తోనూ మరిన్ని ఒప్పందాలు చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు.
ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా, సెర్ప్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి మంగళవారం సమీక్షించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మారెటింగ్ కోసం త్వరలో పలు సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మహిళా సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, దీనికి తగినట్టు ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబుల్, బ్రాండ్ ఏర్పాటు చేస్తే మరింత ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ మహిళా సంఘాలు అభివృద్ధి, పొదుపు దేశంలో నంబర్‌వన్‌గా నిలిచాయని తెలిపారు. ఈ సమీక్షలో గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ హనుమంతరావు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, సెర్ప్ సీవోవో రజిత తదితరులు పాల్గొన్నారు.