హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ఫేక్ సర్టిఫికెట్లను నివారించడంతోపాటు సులభంగా, సమర్థంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు విద్యార్థుల పాస్ మెమోలను డిజిలాకర్‌లో పెట్టనున్నది. దీనిని ఎవరుపడితే వారు ఓపెన్ చూసి చూడకుండా ఏర్పాట్లు చేయనున్నది. డిజిలాకర్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించాలని నిర్ణయించింది. ఏ కారణంగా వెరిఫికేషన్ కోరుతున్నారో సైతం వెల్లడించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. స్టూడెంట్ అకడమిక్ డాటా వెరిఫికేషన్ సర్వీస్ అంశంపై సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డిజిలాకర్ అంశంపై ఉన్నత విద్యామండలి, పోలీసు అధికారులతో ఆయన చర్చించారు. సాంకేతికపరంగా ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు కోరారు. వచ్చే విద్యాసంవత్సరంనాటికి 20 ఏండ్లకు సంబంధించిన సర్టిఫికెట్ల డాటాతో కూడిన డిజిలాకర్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిజిలాకర్ ఖరారుపై వచ్చే శుక్రవారం అన్ని వర్సిటీల వీసీలతో మరోమారు సమావేశం నిర్వహించనున్నారు.