హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది జూలై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పు తీసుకున్నట్టు బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఆర్బీఐ వద్ద మరో రూ.3 వేల కోట్లు రుణం తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. రూ.వెయ్యి కోట్ల విలువైన మూడు బాండ్లను ఆర్బీఐ వద్ద వేలానికి పెట్టింది. మూడు బాండ్లను వేర్వేరుగా 16 ఏండ్లు, 18 ఏండ్లు, 22 ఏండ్ల కాలానికి ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ జారీచేసింది. వీటిని ఈ నెల 6న వేలం వేయనున్నట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది. ప్రతి నెల రూ.5 నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్లను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకుంటున్నది.
నిరుడుతో పోలిస్తే 10 వేల కోట్లు ఎక్కువ
ఈ ఏడాది రూ.62,012 కోట్ల రుణ సమీకరణ చేయనున్నట్టు ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రతిపాదించింది. నిరుడుతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్ర అప్పు పద్దు రూ.10 వేల కోట్లు ఎక్కువ. బహిరంగ మార్కెట్లో రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1,000 కోట్లు సమీకరించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు చెప్పారు. గతంలో ఉన్న అప్పులు, వడ్డీ చెల్లింపుల కింద రూ.42,892 కోట్లు చెల్లించినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏటా రూ.6,050 కోట్లు అప్పులు, వడ్డీల కింద చెల్లించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు నెలకు రూ.5,365 కోట్లు చెల్లిస్తున్నట్టు సర్కారు వెల్లడించింది. గతంలో తీసుకున్న అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.30 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఇందులో రుణం చెల్లింపుల కోసం రూ.13,177.60 కోట్లు, వడ్డీ చెల్లింపుల కోసం రూ.17,729 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ అప్పుల పద్దు ఏటేటా పెరుగుతున్నది. 2022-23లో మొత్తం రాబడుల్లో రూ.44,060 కోట్లు రుణాల కింద వచ్చాయి. 2023-24లో రూ.52,576 కోట్లు తీసుకున్నారు. ఈ ఏడాది అప్పు పద్దు కింద రూ.62 వేల కోట్లు చూపించారు.