హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాలనలోని లోపాలను కవులు, సాహితీవేత్తలు ఎప్పటికప్పుడు ఎత్తిచూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదని అభిలషించారు. తెలంగాణగడ్డలోనే ధికారం ఉన్నదని, అదే స్థాయిలో ప్రేమ కూడా ఉంటదని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే కవి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో సోమవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. యువ కవుల రచనలతో తెలంగాణ సాహిత్యం వందల ఏండ్లు వర్ధిల్లుతుందని, అందుకే యువ కవి సమ్మేళనం అన్ని భాషల్లో నిర్వహించామని తెలిపారు. 35 ఏండ్లలోపు కవులు ఈ సమ్మేళనంలో పాల్గొని కవితాగానం చేశారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిక్సూచిలా, దారిదీపంలా నిలబడి ఉద్యమ దిశానిర్దేశం చేశారని, ఆయన సాగించిన పోరాటాలు, వందలాది మంది త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు ఈరోజు అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగించిన పోరాటం, అమరుల త్యాగాలు, ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో దగా పడిన వైనాన్ని కవులు, సాహితీవేత్తలు అద్భుతంగా చెప్పారని గుర్తుచేశారు. రేపటి తెలంగాణ అభివృద్ధి, వికాసం కోసం సాహిత్య సృజన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వనరులను పరిరక్షించుకోవాలన్నా, నీళ్లు, నిధులు, హకులు కాపాడుకోవాలన్నా అందుకు కవులు, సాహితీవేత్తల సహకారం అవసరమని తెలిపారు. ఈ అంశాలపై తెలంగాణ జాగృతి చేపట్టబోయే కార్యక్రమాలకు చేయూతనందించాలని కోరారు.
యువ వికాసం పథకానికి తెలంగాణతో సంబంధం లేని రాజీవ్‌గాంధీ పేరు కాకుండా తెలంగాణ ఉద్యమకారుల పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేసిందని కవిత గుర్తుచేశారు. యువ వికాసం అర్హుల ఎంపికలో లోపాలున్నాయని ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్న ప్రభుత్వం.. పథకానికి తెలంగాణ ఉద్యమకారుల పేరు పెట్టేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి బీవీఆర్ చారి పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఒకే రోజు కావడం సంతోషకరమని తెలిపారు. ఈ సందర్భంగా కంచనపల్లి గోవర్ధనరాజు రచించిన బలమూరి కొండలరాయుడు గేయ కావ్యాన్ని కవిత ఆవిషరించారు. తెలంగాణ సారస్వత పరిషత్ పురసారాన్ని పొందినందుకు ఆయనను అభినందించారు.
సుదీర్ఘ పోరాటం, వందలాది మంది బలిదానాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అని నినదించలేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ దృఢ సంకల్పం, దూరదృష్టితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని పునరుద్ఘాటించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు కనీసం సరైన నివాళులు కూడా అర్పించని ప్రభుత్వం ప్రస్తుతం ఉండటం దురదృష్టకరమని విమర్శించారు.