హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 307లోని రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బంధువుల పేరిట ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారనే కేసులో హైకోర్టు స్టేటస్ కో(యథాతథస్థితి) ఉత్తర్వులను జారీచేసింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్, ఇతరులు వేసిన మరో పిటిషన్ రెండు వేర్వేరు సింగిల్ బెంచ్‌ల వద్దకు బుధవారం విచారణకు వచ్చాయి. రెండు కేసులను కలిపి ఒకే న్యాయమూర్తి వద్దకు విచారణకు వచ్చేలా హైకోర్టు రిజిస్ట్రీ చర్యలు తీసుకోవాలని జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే మరో పిటిషన్ జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి వద్దకు విచారణకు వచ్చింది.
ఎమ్మెల్యే కుటుంబసభ్యులు దాఖలు చేసిన పిటిషన్లో సర్వే నంబర్ 307లోని భూముల వ్యవహారంపై స్టేటస్కో కొనసాగించాలని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెండు పిటిషన్లను కలిపి ఎవరు విచారణ చేయాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చుతారని న్యాయవాది డీ జగదీశ్వర్ తెలిపారు. సర్వే నెంబర్ 307లో 441 ఎకరాల భూమి ఉండగా.. అందులో 317.25 ఎకరాలు సీలింగ్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన 123.28 ఎకరాల ప్రైవేట్ భూమిలో ఇండ్ల నిర్మాణాలు జరిగిపోయాయి. ‘తమ పేరిట ఉన్న 11 ఎకరాలను ఎప్పుడో విక్రయించి వెళ్లిపోయిన వాళ్లను తీసుకొచ్చి వాళ్ల పేరిట భూమి లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా చేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన భూమి అక్రమ రిజిస్ట్రేషన్లకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రభుత్వ భూమే. ఎమ్మెల్యే గాంధీ భార్య ఏ శ్యామలాదేవి, కుమార్తె నందిత ఇతరులు అక్రమ మార్గంలో వశం చేసుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలి’ అని పిటిషన్లో పేర్కొన్నారు.