హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్య, వైద్య రంగాలు పూర్తిగా ప్రైవేట్, కార్పొరేట్ చేతుల్లో ఉండటంతో ఫీజుల నియంత్రణ ఉండటంలేదని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆయా రంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తేవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడారు.
వారంరోజుల్లో ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నదని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక లోపించిందని పేర్కొన్నారు. ఏడాదికి రూ.25వేల కోట్ల విద్యా వ్యాపారం జరుగుతున్నదని వెల్లడించారు. ఫీజులు నియంత్రణ కోసం చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, ఆస్పత్రులను సందర్శించనున్నట్లు తెలిపారు.
రేషన్ కార్డుల ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కేవలం బియ్యం తప్ప ఎలాంటి ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వడంలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రేషన్‌కార్డుపై ఒకరికి 10కేజీల బియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.