హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు.. పాత పింఛన్ సాధన ఉద్యమానికి తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీపీఎస్ఈయూ) శ్రీకారం చుట్టింది. ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమైన సంఘం రాష్ట్ర కార్యవర్గం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఆగస్టు 23న ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చింది. 2.6లక్షల మంది ఉద్యోగులతో ఆగస్టు 23న హైదరాబాద్‌లో కదం తొక్కుతామని సంఘం ప్రకటనలో తెలిపింది. దీనికి ముందు జూలైలో రాష్ట్రవ్యాప్త సీపీఎస్ జన జాగరణ యాత్రను చేపడుతామని, ప్రతి సీపీఎస్ ఉద్యోగిని కలిసి సర్కార్ నిర్లక్ష్యాన్ని వివరిస్తామని సంఘం నేతలు ప్రకటించారు. ‘సీపీఎస్ హటావో.. ఎంప్లాయీస్ బచావో’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని హోరెత్తిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ వెల్లడించారు.
సీపీఎస్‌ను రద్దుచేస్తామని పాత పింఛన్ అమలుచేస్తామని హామీనిచ్చి గద్దెనెక్కిన సర్కార్ రెండేండ్లు దాటినా ఈ హామీని నెరవేర్చకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొన్నదని స్థితప్రజ్ఞ, శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలైన ఈహెచ్ఎస్, డీఏ ఎరియర్స్ జమకాకపోవడం తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నదని వాపోయారు. ఈ విషయంలో సర్కార్ అవలంబిస్తున్న పక్షపాత ధోరణి అందరిని కలిచివేస్తున్నదని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆవేదనను తెలియజేసేందుకు సీపీఎస్ రద్దు అమలు హామీని నెరవేర్చేందుకే ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు పోరాడుతామని పేర్కొన్నారు. జన జాగరణలో భాగంగా సీపీఎస్ ఉద్యోగులను కలిసి ఉద్యమంలో మమేకం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కూరకుల శ్రీనివాస్, మ్యాన పవన్, లింగమూర్తి, పోల శ్రీనివాస్, మల్లికార్జున్, రోషన్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.