రాష్ట్ర ఖజానానుంచి ముగ్గురు మంత్రుల శాఖలకే ‘గ్రీన్‌చానల్’ ద్వారా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయా? మిగిలిన వారంతా ‘ప్రాపర్’ చానల్లో బిల్లుల కోసం క్యూ కట్టాల్సిందేనా? తాజా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ బిల్లుల వివాదం క్యాబినెట్‌ను కుదిపేస్తుండగా.. తమ మీద కొనసాగుతున్న వివక్ష మీద పలువురు మంత్రులు కుతకుత ఉడికిపోతున్నారని సమాచారం. మొదటినుంచీ కొన్ని సంస్థలకే పనులు దక్కుతుండటం.. కొందరి శాఖల బిల్లులను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేస్తుండటంపై వారు రగలిపోతున్నారని తెలిసింది.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లోని బిల్లుల చెల్లింపులకే రాష్ట్ర ఖజానా మొత్తం పోతున్నదా? వారికి అనుబంధంగా ఉన్న కంపెనీలకే రూ.వేల కోట్ల నిధుల వరద పారుతున్నదా? మిగతా మంత్రులకు ‘ప్రాపర్’ చానల్లో రావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారా? ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న తీవ్ర చర్చ ఇది. ఇతర మంత్రులు రూ.10 లక్షల బిల్లు తెచ్చినా తిప్పించుకుంటుండగా. ఆ ముగ్గురికి మాత్రం గ్రీన్‌చానల్‌లో క్షణాలపై ఖజానా నుంచి నగదు జమ అయిపోతున్నదట. రూ.10 లక్షల నుంచి 20 లక్షల పనులు చేసుకున్న చోటామోటా కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయీ విదిలించని ప్రభుత్వం.. ఆ మంత్రుల శాఖల్లో జరిగిన పనులకు మాత్రం ‘నో పెండింగ్’ విధానాన్ని పాటిస్తున్నదని మిగతా మంత్రులు ఉడికిపోతున్నారు.
ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లో బిల్లుల చెల్లింపులు, వారికి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టు కంపెనీలకే ఖజానా మొత్తం తరలుతున్నదని సహచర మంత్రులు కుతకుతలాడుతున్నారు. 22 నెలల్లో అక్షరాలా రూ.78 వేల కోట్ల నిధులను అధికారికంగా ముగ్గురు మంత్రుల శాఖల్లోని బిల్లుల చెల్లింపులకే వెళ్లాయని, అనధికార వసూళ్లు ఇంతకు రెట్టింపు ఉంటాయని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఇంతకాలం ఓపికగా వేచిచూసిన మంత్రులు గురువారం క్యాబినెట్ భేటీలో (Cabinet Meeting ) రచ్చ చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమ సిఫారసులను డెడ్చానల్లో పెట్టి తిప్పుతూ, వాళ్లు సిఫారసు చేసిన బిల్లులకు గ్రీన్‌చానల్ ద్వారా క్షణాల మీద బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించినట్టు సమాచారం.
రూ.600 కోట్లు కనబడితే చాలు
రాష్ట్ర ఖజానాలో రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు జమకూడితే ముగ్గురు మంత్రులు తమశాఖల్లోని పెండింగ్ బిల్లులను దగ్గరుండి క్లియర్ చేసుకుంటున్నారని ఇతర మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారట. ప్రభుత్వం ప్రతినెలా సగటున రూ.8 వేల కోట్ల చొప్పన తెస్తున్న అప్పుల్లో సగం సొమ్ము వివిధ రూపాల్లో ముగ్గురి శాఖల్లోకే చేరిపోతున్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో పూర్తయిన పనులకు కూడా బిల్లులు చెల్లించడం లేదని ఇతర మంత్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తన నియోజకవర్గంలోని కాంట్రాక్టర్‌కు రూ.10 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కనీసం సగమైనా విడుదల చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కీలక మంత్రుల్లో ఒకరికి బీసీ మంత్రి ఫోన్‌చేసి విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
దీనికి ప్రస్తుతం ఖజానాలో డబ్బులేదని ఆయన తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఇది జరిగిన మూడు రోజుల్లోనే ఒక కాంట్రాక్టు కంపెనీకి రూ.130 కోట్లను ఏకమొత్తంలో చెల్లింపులు చేసినట్టు సదరు మంత్రికి తెలిసిందట. వెంటనే కీలక మంత్రుల్లో ముఖ్యనేతకు ఫిర్యాదుచేసినట్టు సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణకు చెందిన ఒక యువ ఎంపీ రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులు పట్టుకొని రాగా.. రెండు నెలలు తిప్పుకొని రూ.3 కోట్లతో సరిపెట్టి పంపారని ఓ మంత్రి తన సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పెండింగ్ బిల్లుల కోసం ఇటీవల ఒక మంత్రి ఫైళ్లు చేతిలో పెట్టుకొని తిరిగినా రూపాయి కూడా చెల్లించలేదని సమాచారం.
రైతుల నోట్లో మట్టికొట్టి.. ఇద్దరికి నిధులు మళ్లింపు
కేసీఆర్ తన హయాం చివరి దశలో రూ.7,500 కోట్లు రైతుబంధు పథకం కోసం ఖజానాలో జమచేసి పెట్టారు. రైతులకు విడుదల చేసేలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, రైతుబంధు విడుదల చేయొద్దని నాటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఈసీకి లేఖ రాయడంతో రైతుల ఖాతాల్లోకి చేరని సంగతి తెలిసిందే. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఖజానాలో ఉన్న ఆ రూ.7,500 కోట్లకు మరికొంత జోడించి రైతుభరోసా కింద నిధులు విడుదల చేస్తారని, తమ ఖాతాల్లో జమ అవుతాయని రైతులు ఎదురుచూశారు. కానీ ఆ డబ్బు అనూహ్యంగా కీలక మంత్రి కుటుంబానికి చెందిన కంపెనీ పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వినియోగించారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు బహిరంగంగా విమర్శించారు. దీంతో రైతులకు రైతుభరోసా చెల్లించకుండానే మొదటి దశ వెళ్లిపోయింది.
ఈ ఏడాది యాసంగిన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.49 కోట్ల ఎకరాలకు రైతుభరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.9,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ అంచానా వేసింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి సర్వేనంబర్-25లో ఉన్న 400 ఎకరాలను ప్రభుత్వం బ్యాంకులకు కుదువపెట్టి రూ.10 వేల కోట్లను అప్పుగా తీసుకున్నది. వీటిని రైతులకు విడుదల చేయకుండా ఇద్దరు మంత్రులు తమ శాఖల్లోని పెండింగ్ బిల్లుల పేరుతో రూ.6,000 కోట్లను దగ్గర పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రైతుభరోసా పథకం కింద నిధులు మూడు విడతల్లో రూ.3,511 కోట్లే ఇచ్చారు. ఈ డబ్బుల్లోనూ కక్కుర్తి పడ్డారని, రూ.1,269.32 కోట్లను 10.13 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారని మిగతా రూ.2,242 కోట్లను కీలక మంత్రుల్లో ఒకరు తన సన్నిహిత కాంట్రాక్టు కంపెనీలకు 16 శాతం కమీషన్ తీసుకొని బిల్లులు క్లియర్ చేశారని అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. మొత్తంగా ముగ్గురు మంత్రులు కలిసి రైతులకు పెట్టుబడి ఎగ్గొట్టారని సహచర మంత్రులే విమర్శలు గుప్పిస్తున్నారు.
రూ.కోట్లు ఇస్తామని ఆశ పెట్టి
ముగ్గురికే గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు చెల్లించడం, తమను విస్మరించడంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కొంతమంది యువ ఎమ్మెల్యేలు రహస్య సమావేశంలో చర్చించుకున్నట్టు సమాచారం. ముగ్గురు మంత్రులు, ఏపీకి వత్తాసు పలికే కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చుకుంటూ వెళ్తే తాము నియోజకవర్గాల్లో ఏం పనులు చేయాలని గట్టిగానే స్వరం వినిపించినట్టు తెలిసింది. దీంతో యువ ఎమ్మెల్యేల ధిక్కారంపై ఉక్కుపాదం మోపాలని ముగ్గురు మంత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదట. దీంతో వారిని చల్లబరిచేందుకు ప్రతి ఎమ్మెల్యేకు నెలకు రూ.5 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. నియోజకవర్గం కాంట్రాక్టు పనులతో సంబంధం లేకుండా బిల్లులు క్లియర్ చేస్తామని, వెసులుబాటును బట్టి కమిషన్లు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం. తమకు జూలై వరకు బిల్లులు క్లియర్ చేసి, ఆగస్టు నుంచి బంద్ చేశారని ఆ ఎమ్మెల్యేలే మళ్లీ చెప్తున్నారు.
వీళ్ల గోడు పట్టదా?
రాష్ట్రంలో 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించి రూ.10 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. జీపీఎఫ్, సరెండర్ సెలవులు, నగదు ఎన్‌క్యాష్‌మెంట్ సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, సంపాదిత సెలవుల బిల్లులు కలిపి మొత్తం రూ.8 వేల కోట్లతోపాటు సీపీఎస్ ఉద్యోగులవి మరో రూ.2 వేల కోట్ల బిల్లుల బకాయి ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. వీరికి దఫాల వారీగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒకటి, రెండు దఫాలే చెల్లించి తర్వాత చేతులెత్తేసిందని ఆయా సంఘాల నేతలు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. దశల వారీగానైనా బిల్లులు క్లియర్ చేయాలని కోరినా స్పందన లేదని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు గ్రామాభివృద్ధిలో భాగంగా చేసిన చిన్నపాటి కాంట్రాక్టు పనులకు సంబంధించి రూ.369 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు రాబట్టడం కోసం సర్పంచులు చేయని ప్రయత్నం లేదు. అయినా వారికి ఇప్పటివరకు ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. ముగ్గురు మంత్రులు, మూడు కంపెనీలకు గ్రీన్‌చానల్‌లో నిధులు చెల్లిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వీరి గోడు పట్టదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇతర మంత్రుల శాఖల్లో జోక్యం.. కోట్లలో బేరం
ఇతర పద్ధతుల ద్వారా వచ్చే డబ్బుల కోసం తమ శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. శాఖపరమైన వ్యహారాలు, వసూళ్లు, సెటిల్మెంట్లు తదితర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారట. ఆ ముగ్గురు మంత్రులు కలిసి ఆరుగురు వ్యక్తులతో షాడో టీమ్‌ను ఏర్పాటుచేశారని సమాచారం. సాధారణంగా సీఎంవోలో ఐఏఎస్ అధికారులకు శాఖలను కేటాయించినట్టే షాడో టీమ్‌కు కూడా శాఖలు అప్పగించారని, వాళ్లు ఆయా శాఖల అధికారులతో, ప్రత్యేక ఏజెంట్ వ్యవస్థ ద్వారా వసూళ్లు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ముఖ్యనేత అజమాయిషీ కింద పనిచేసే ఒకరికి విద్యాశాఖ, ఇసుక వ్యాపార లావాదేవీలు అప్పగించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. సదరు వ్యక్తి ఉత్తర తెలంగాణ మీద గుత్తాధిపత్యం సాధించటం కోసం మహిళా మంత్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆయన ప్రోత్సాహంతోనే ఇటీవల అర్ధరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారనే ప్రచారం జరుగుతున్నది. గన్ను తలకు గురిపెట్టిన వ్యవహారంలో బయటికి వచ్చిన షాడోకునేతకు సినీ పరిశ్రమ, ఫార్మారంగం, మైనింగ్, సిమెంట్ రంగాలతోపాటు, నగరంలోని భూ దందాల సెటిల్మెంట్ భాధ్యతలు అప్పగించినట్టు కాంగ్రెస్ మంత్రులు బహిరంగంగా చెప్తున్నారు. బిగ్డీల్స్ ఏమైనా ఉంటే బద్రర్స్తోపాటు, ఆ మధ్య అందాల పోటీల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన వ్యక్తి చూసుకుంటున్నారని సమాచారం. తమ శాఖల్లో చిన్న పంచాయితీ, పెద్ద పంచాయితీ ఏదైనా వారే మంత్రాంగం చేస్తున్నారని మంత్రులు వాపోతున్నారట. తాము ఏదైనా మాట్లాడితే ముఖ్యనేత దగ్గర ఫైల్ ఆగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖ పంచాయితీ మాత్రమే బయటికి వచ్చిందని, తాము కడుపు చించుకుంటే కాళ్ల మీద పడేలా ఉన్నదని సీనియర్ మంత్రి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.