ఖమ్మం, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మండిపడ్డారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. ఈడీ తెల్లవారుజామున నోటీసులు ఇవ్వడం, తెల్లారే ఢిల్లీకి రావాలని చెప్పడం అత్యంత హేయమని అన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే నోటీసులు పంపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ను ఎదుర్కొలేకనే దొడ్డిదారిన కుట్ర పన్నుతున్నదని అన్నారు. ఇందులో భాగంగానే లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం ఉన్నట్టు చిత్రీకరిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాల నాయకులపై బెదిరింపులకు పాల్పడడం, లొంగదీసుకునే కుట్రలు చేయడం బీజేపీకి అలవాటేనన్నారు.