హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వ వాదనను తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను కొట్టేయాలని కోరుతూ ఆ జిల్లాలోని రామేశ్వరపల్లికి చెందిన శ్రీనివాస్ సింగ్ సహా 40 మంది రైతులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ మాధవీదేవి సోమవారం విచారణ జరిపారు.
ప్రభుత్వ వాదన వినిపించేందుకు గడువు ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరడంతో అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. ఇదే సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోక్యం చేసుకుంటూ.. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు కొడుతున్నారని, దీ నిపై తాను కూడా పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపారు. వ్యక్తిగత హాదాలో వాదన వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరడంతో ఈ కేసుల విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది.