హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు.. నీళ్లులేక నోళ్లు తెరిచిన బీళ్లు, రోడ్లు లేని ఊళ్లు, కరెంటు లేని ఇండ్లు, దొరకని పనులు, పస్తులు, వెరసి వలసలు, ఆకలిచావులు. మరోవైపు.. ఎగసిన విప్లవోద్యమాలు, నిత్యం తుపాకుల మోతలు, ఎన్కౌంటర్లు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని రోజులు, దినమొక గండంగా గడిచిన బతుకులు… ఎనిమిదేండ్ల క్రితం ఇదీ తెలంగాణ బతుకుచిత్రం. మండువేసవిలోనూ మత్తడి దుంకుతున్న చెరువులు, కనుచూపుమేర పచ్చనిపొలాలు, పుట్లకొద్దీ ధాన్యపురాశులు, కొత్త చివుళ్లు తొడిగిన పల్లెలు, ప్రగతి దారులు, విద్యుత్తు వెలుగులు, తరలివస్తున్న పరిశ్రమలు, ఉపాధి బాటలో ఊళ్లు, అందుతున్న పోరాట ఫలాలు. సాకారమవుతున్న స్వప్నాలు.. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలన ఆవిష్కరించిన అద్భుతాలివీ. 8 ఏండ్లలోనే అన్నిరంగాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసి, నూతన చరిత్రను లిఖించుకుంటూ యావత్తు దేశానికి నేడు తెలంగాణ దారిచూపుతున్నది.
రైతుబంధు దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది. ఆ పథకాన్ని చివరికి ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించారు. ఒడిశాలోనూ కాలియా పేరుతో అమలు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్లో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తున్నారు. తెలంగాణ సంసరణలను, పథకాలను ఆంధ్రప్రదేశ్ పేర్లు మార్చి అమలుచేస్తున్నది. మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మి, పంట రుణమాఫీ, టీ-హబ్, అన్నపూర్ణ, టీఎస్ ఐపాస్లను అమలు చేస్తామని కర్ణాటక ఎన్నికల్లో అకడి బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ర్టాలు మన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్ సర్కారు మన మిషన్ భగీరథ పథకాన్ని ‘హర్ ఘర్ నల్- హర్ ఘర్ జల్’ పేరిట అమలు చేస్తున్నది. మిషన్ కాకతీయను స్ఫూర్తితో మహారాష్ట్ర సర్కార్ జల్ యుక్త్ శివార్ పేరిట చెరువుల పునరుద్ధరణ ప్రారంభించింది.
రాష్ట్ర పథకాలపై విస్తృత అధ్యయనం
మిషన్ భగీరథ పథకంపై 9 రాష్ట్రాలు, షీ-టీం వ్యవస్థపై బెంగాల్ ప్రభుత్వం, కంటివెలుగుపై ఒడిశా, గొర్రెల పంపిణీ పథకంపై తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశాయి. పౌరసరఫరాలశాఖలో అమలుచేస్తున్న సంసరణలను తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, యూపీతోపాటు శ్రీలంక అధికారుల బృందం అధ్యయనం చేసింది. మన ఇసుక పాలసీనే పంజాబ్‌లో యథాతథంగా అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది.
విమర్శకుల నుంచి ప్రశంసలు..
తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలని కాగ్, నీతి అయోగ్ వంటి కేంద్రసంస్థలు వివిధ రాష్ట్రాలకు సూచించాయి. భూరికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్లు, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతుబంధు వంటివి దేశానికే ఆదర్శమని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణ్యన్ ప్రశంసించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఏర్పాటు చేసిన మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్‌పై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ప్రధాని మోదీ పార్లమెంటులో తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావించడంతోపాటు మన్ కీ బాత్‌లోనూ మిషన్ భగీరథ భేష్ అని కితాబిచ్చారు. మన పథకాలను మాజీ, ప్రస్తుత కేంద్రమంత్రులు ప్రశంసించిన సందర్భాలెన్నో.
అన్నిరంగాల్లో అవార్డుల పంట..
మౌలికవసతుల కల్పన, సంక్షేమ రంగం ఇలా అన్ని రంగాలకు సంబంధించిన సూచీల్లో తెలంగాణ ఆగ్రస్థానం దిశగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే వైద్యారోగ్యంలో, ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధజలాలను అందించడంలో మొదటి స్థానంలో నిలిచింది. పచ్చదనం, పరిశుభ్రతలోనూ ముందువరుసలో నిలిచి 75కు పైగా అవార్డులను సొంతం చేసుకొన్నది. కేంద్రం అందించే అవార్డులే కాకుండా సెంటర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్,స్కోచ్ తదితర అవార్డులను సైతం తెలంగాణ సొంతం చేసుకొన్నది.