హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓవైపు రేవంత్రెడ్డి సర్కార్ తెస్తున్న అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నది. దీంతో ద్రవ్యలోటు (ఆదాయ, వ్యయాల మధ్య అంతరం) భారీగా పెరిగిపోతున్నది. ప్రస్తుత (2025-26) ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం ముగిసే నాటికి రాష్ట్ర ద్రవ్యలోటు మైనస్ రూ.65,930.31 కోట్లుగా, రెవెన్యూ లోటు మైనస్ రూ.9,601.02 కోట్లుగా నమోదైంది. రాష్ట్ర ద్రవ్యలోటును పూడ్చేందుకు ప్రభుత్వం ప్రధానంగా అప్పులపైనే ఆధారపడుతున్నట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేస్తున్నది. ఆ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి నికరంగా మొత్తం రూ.54,009.74 కోట్ల రుణాలు సమీకరించాల్సి ఉంటుందని రాష్ట్ర బడ్జెట్లో అంచనా వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. డిసెంబర్ నాటికే రూ.65,930.31 కోట్ల అప్పులు తెచ్చింది. అంటే కేవలం తొలి 9 నెలల్లోనే లక్ష్యానికి మించి 22.07% అధికంగా రుణాలు సమీకరించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ అంచనాలకు లోబడి రుణాలు తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.2,16,566.97 కోట్ల అప్పులు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. తొలి 9 నెలల్లో రూ.1,25,002.72 కోట్లు మాత్రమే సమీకరించింది. ఇది బడ్జెట్ అంచనాల్లో కేవలం 57.72 శాతమే.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర సొంత రాబడులు భారీగా తగ్గిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడుల రూపేణా రూ.2,29,720.63 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా.. డిసెంబర్ నాటికి రూ.1,24,911.19 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇవి బడ్జెట్ అంచనాల్లో కేవలం 54.38 శాతమే. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లలో 16.70% మాత్రమే వచ్చాయి. విద్య, వైద్యం వంటి సామాజిక రంగాలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో డిసెంబర్ నాటికి 50.84%, ప్రభుత్వ సబ్సిడీలకు వెచ్చించాల్సిన నిధుల్లో 64.08% మాత్రమే ఖర్చు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
