జోగులాంబ గద్వాల : శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి, సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు.
మంగళవారం చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, కుశ్రం నీలా దేవి, రాంబాబు నాయక్, రెణికుంట్ల ప్రవీణ్‌లతో కలిసి అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్బంగా విఘ్నేశ్వర పూజ కూడా నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం బహుకరించి ఆశీస్సులు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఐదవ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారమై, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేవిధంగా అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, అన్ని సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు సమర్థంగా చేరేలా ప్రభుత్వం ధృడనిశ్చయంతో ముందుకెళ్లాలని తల్లిని ప్రార్థించినట్లు చైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అలివేలు, డిఎస్పీ మొగలయ్య, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ రమేష్ బాబు, ఈవో పురేందర్, అలంపూర్ తహసీల్దార్ మంజుల, స్థానిక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.