హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : అందాల పోటీలు నిర్వహించేందుకు పైసలున్నయ్గానీ, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు పైసల్లేవా? అని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి సర్కారును నిలదీశారు. మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరోపక్క అందాల పోటీలు పెట్టడం హాస్యాస్పదంగా ఉన్నదని విమర్శించారు.
మాజీ సర్పంచులతో కలిసి హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ఎన్నో వేదికలపై ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి వచ్చాక సర్పంచులను విస్మరించి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. గ్రామాలు బాగుండాలని అప్పులు చేసి అభివృద్ధి చేస్తే, ఏడాదిన్నర కావస్తున్నా పెండింగ్ బిల్లుల విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. మాటకు కట్టుబడి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.