ఖైరతాబాద్, డిసెంబర్ 7 : రాష్ట్రంలో మంత్రిత్వ శాఖే లేని గిరిజనుల సంక్షేమం ఎలా సాధ్యం? అని నంగారాభేరి, లంబాడా హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్)రాష్ట్ర అధ్యక్షుడు, గిరిజన సంఘాల ఐక్య వేదిక కోఆర్డినేటర్ గుగులోతు రాజేశ్‌నాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గిరిజనులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనవరి 30న ఇందిరాపార్కు వద్ద నిర్వహించే ‘గిరిజన గర్జన’ మహాధర్నా పోస్టర్‌ను ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పాయం సత్యనారాయణ, లీగల్ అడ్వైజర్ శ్రీనాథ్, లంబాడా విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యకుమార్, ఏజెన్సీ డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ సోమేశ్‌తో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేశ్‌నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జూలై 1న గిరిజన సంక్షేమ శాఖ ముట్టడి ఫలితంగా ప్రభుత్వం జీవో-18ని విడుదల చేసిందని, దాని ప్రకారం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఏజెన్సీలో వంద శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని తెలిపారు. జనరల్ డీఎస్సీ నోటిఫికేషన్‌తో ఏజెన్సీలోని నిరుద్యోగులు నష్టపోతున్నారని, ప్రత్యేకంగా ఏజెన్సీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 29 ప్రభుత్వ శాఖల్లో రిజర్వేషన్ అమలు చేయాలని, లేకుంటే జనవరి 30న గిరిజన గర్జన మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.