హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దు టీజీపీఎస్సీ ప్రతిష్టకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఒక్క కేసుతో భారీ అప్రతిష్టను మూటగట్టుకున్నది. పూడ్చలేనంత నష్టాన్ని కొనితెచ్చుకున్నది. టీజీపీఎస్సీ అధికారులు, వర్గాలు ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోవడమే లేదు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం బుధవారం కమిషన్ కార్యాలయానికే రాలేదు. వస్తారని, కమిషన్ భేటీ ఉంటుందని వార్తలొచ్చినా సమావేశమే జరగలేదు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్తారని ఆరా తీసేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా.. చైర్మన్ అందుబాటులోకి రాలేదు.
మధ్యాహ్న సమయంలో ఉన్నతస్థాయి సమావేశం ఉంటుందని మీడియాలో లీకులొచ్చాయి. కానీ ఉన్నతస్థాయి సమావేశమేదీ జరగలేదు. రీ వాల్యుయేషన్ వద్దు.. మళ్లీ మెయిన్స్ నిర్వహించాలన్న డిమాండ్‌తో టీజీపీఎస్సీ అధికారులను కొందరు నిరుద్యోగులు, జేఏసీ నేతలు కలిసే ప్రయత్నం చేశారు. అయినా ఎవరూ అందుబాటులోకి రాలేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తదితరులు కమిషన్ కార్యదర్శికి వినతిపత్రాన్ని సమర్పించా ల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, గ్రూప్-1పై సింగిల్ బెంచ్ తన తీర్పులో టీజీపీఎస్సీ వైఫల్యాలను ఎండగట్టింది. అనేక తప్పిదాలను ఎత్తిచూపింది. ఈ తరుణంలో ఈగోలకు వెళ్లి డివిజన్ బెంచ్‌కు వెళ్లినా, సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడ కూడా ఎదురుదెబ్బలు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు.