హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): జమిలి ఎన్నికల అధ్యయన కమిటీని మొక్కుబడిగానే నియమించినట్టు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఇప్పటికే సిద్ధం చేసిన స్క్రిప్టును చదివి వినిపించడానికే కమిటీని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌తో కమిటీ వేయడం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నారు. కమిటీలో దక్షిణభారత్ నుంచి ఒక్కరూ కూడా లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదురోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ప్రధాని మోదీ దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టారని మండిపడ్డారు. 2018లోనే జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ అభిప్రాయం చెప్పామని గుర్తు చేశారు.
జమిలి ఎన్నికలు మంచిదే కానీ, చర్చ జరగాలని లా కమిషన్‌కు స్పష్టం చేశామని పేర్కొన్నారు. మోదీకి తప్ప బీజేపీ నేతలకు కూడా ఏమి జరుగుతున్నదో తెలియడం లేదని చెప్పారు. జమిలి ఎన్నికలపై ఇప్పటికే రిపోర్ట్ రెడీ అయిందా? ఇప్పుడు వేసిన కమిటీ మొక్కుబడి కోసమేనా? అనే అనుమానం కలుగుతున్నదని తెలిపారు. దేశాన్ని మోదీ ఎటువైపు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఏపీ విభజన చట్టం రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెంచాలని స్పష్టం చేసిందని, కానీ మోదీ సరార్ పట్టించుకోలేదని చెప్పారు. చిన్న సవరణతో తెలుగు రాష్ర్టాల్లో శాసనసభ్యుల సంఖ్యను పెంచొచ్చని, కానీ మోదీ ఆ విషయాన్ని గాలికొదిలేశారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలకు ఐదు రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ ముందుకెళ్తున్నారని, కానీ విభజన చట్టంలోని చిన్న సవరణను మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పదేండ్లుగా మోదీ సర్కారు చేసిందేమిటని నిలదీశారు. జమిలి ఎన్నికల అంశం, తాజా పరిణామాలపై బీఆర్ఎస్లో చర్చిస్తామని తెలిపారు.