హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, ఫలితాల సాధనలో రూపొందించే ఉత్తమ ప్రణాళికలే రాష్ట్ర ప్రగతికి పునాదులు వేస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన ప్రణాళిక, అర్థ గణాంక శాఖ ఉన్నతాధికారులు, సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (సీఈజీఐఎస్), కాకతీయ గవర్నెన్స్ ఫెలో (కేజీఎఫ్) ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థంగా అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రణాళిక, అర్థ గణాంక శాఖ, సీఈజీఐఎస్, కేజీఎఫ్ బృందాలు ఉత్తమ ప్రణాళికలతో పని చేయాలని, అప్పుడే ప్రగతికి గట్టి పునాదులు పడతాయని చెప్పారు. ప్రణాళికశాఖ పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు.
ఆర్థిక, ప్రణాళికాశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరు తెన్నులను సూక్ష్మ స్థాయిలో పరిశీలించి పకాగా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో అమెరికా కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్, అర్థ గణాంకశాఖ డైరెక్టర్ దయానంద్, రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ పర్యవేక్షణ అధికారి రామకృష్ణ, సలహాదారు రామభద్రం తదితరులు పాల్గొన్నారు.