హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఆర్థిక క్రమశిక్షణలో దేశంలో తెలంగాణకు సాటిలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణపై కొన్ని రాష్ర్టాలు గాడి తప్పుతున్నాయని, ఉచితాలు ప్రకటిస్తున్నాయని, ఇది ప్రమాదకరమని, పక దేశాల ఆర్థిక దుస్థితిని గమనించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ ప్రణాళికతో ముందుకెళ్తున్నదని, చేస్తున్న అప్పులను భవిష్యత్ తరాల కోసం ఖర్చు చేస్తున్నదని, ఆస్తులను సృష్టిస్తున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ చేస్తున్న అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై వెచ్చిస్తూ, తద్వారా భవిష్యత్తు కోసం సంపదను పదింతలు రెట్టింపు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ కేంద్రంతో పాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పులను తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టుల కోసం మాత్రమే వెచ్చించినదని, తద్వారా అద్భుతమైన ఫలితాలు రాష్ట్రంలో ఇప్పటికే చూస్తున్నామని చెప్పారు. పైఎత్తిపోతల పథకాలతో పంటలు పుషలంగా పండుతున్నాయని, వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలూ గణనీయంగా పెరిగాయని, భూగర్భంలో దాదాపు 600 టీఎంసీల నీళ్లు ఉన్నాయన్నారు. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించిన స్టీల్ ధర అప్పటికన్నా ప్రస్తుతం మారెట్లో విపరీతంగా పెరిగిందని, ఇది భవిష్యత్ తరాల కోసం సంపద సృష్టించినట్టు కాదా? అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. అప్పులు భవిష్యత్తు తరాల బంగారు భవిత కోసమేనని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ గమనించాలని వినోద్ కుమార్ సూచించారు.