హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): అడవుల విస్తరణలో తెలంగాణ యావత్తు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని, వన్యప్రాణుల సంరక్షణలోనూ మొదటి స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్‌కుమార్ పేరొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే కంపా నిధులను కరోనా కాలంలోనూ (2019-20, 2020-21, 2021-22) పెద్ద ఎత్తున వినియోగించుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వినోద్‌కుమార్ తెలిపారు. ఈ విషయమై కేం ద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం 2015-2021 కాలంలో తెలంగాణలో 7.7%, 2019-2021లో 3.07% అడవుల విస్తీర్ణం పెరిగిందని చెప్పా రు.
నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఎస్డీజీ 4వ ర్యాంక్‌లో మెరుగుపడిందని, ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం అటవీ ప్రాంతంలో నీటి లభ్యత పెరిగిందని, గిరిజనులు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, గ్రీనరీ పెరిగిందని, వన్యప్రాణుల సంరక్షణ బాగుందని, కంపా నిధుల వినియోగం బాగుందని పార్లమెంటులో కేంద్ర మంత్రులు పలుమార్లు పేరొన్న విషయాలను రాష్ట్ర బీజేపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని హితవుపలికారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గానీ, ఇతర రాష్ర్టాల్లో గానీ కాంపా నిధుల వినియోగంపై కేంద్ర మంత్రి నివేదికలను వెల్లడించాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.